స్వామి వివేకానంద చెప్పినట్టు ఇతర మతాలవారిని ఖండించే ముందు నీ మతం గురించి అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలిగే స్థితి లో నువ్వు ఉన్నావా? అని ప్రశ్నించుకోవాలట.

మన పిల్లలు కాని పెద్దలు కాని మన హిందూ మతం గురించి అడిగిన ప్రశ్నలకు చెక్కు చెదరకుండా సమాధానం ఇవ్వగలరా? కోటిమందిలో ఒకళ్ళో ఇద్దరో చెప్పగలరేమో, స్వామి వివేకానంద లాగా నిర్భయంగా ఆత్మవిశ్వాశంతో మన ధర్మం గురించిన అంతరార్థాలు చెప్పడం కష్టమైన పని కాని అసాధ్యం కాదు. పిల్లల పాఠ్యాంశాలలో క్రికెట్ ఆటగాళ్ళు, హిందూధర్మవ్యతిరేకులు మొదలైన అనవసరమైన చరిత్రలు సిలబస్ లో పాఠ్యాంశాలుగా చేర్చబాడుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలు ర్యాంకులు తెచ్చి మంచి ఉద్యోగం సంపాదిస్తే చాలు, ఈ ధర్మం గురిచి పెద్దగా పట్టించుకొవలసిన అవసరం లేదు అని నిర్లక్ష్యం చేస్తునారు. దీని ప్రభావం దశాబ్దాలుగా ఎలా చూపిందంటే, వేరే మతాలవారితో పోలిస్తే ఎక్కువగా హిందూ కుటుంబాలలో తమ మతం గురించి అవగాహన లేమి వల్ల తమకు తాము దూరం అవటమే కాకుండా పిల్లలకి సహితం మంచి సంస్కారాలు అందివ్వలేకపొతున్నారు.

ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం హిందూ దేవతావ్యవస్థకీ విశ్వానికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని కొంత చర్చించటం.

హిందూమతాన్ని చులకనభావంతో ప్రశ్నించడానికి అజ్ఞానం చాలు, కుతూహలం, కాలక్షేపంకోసం సంభాషణకి టాపిక్ కావచ్చు కాని సమాధానం అర్థం చేసుకోవడానికే కావాలి పక్షపాతరహితమైన బుద్ధి, విషయం మీద గౌరవం.

మచ్చుకకి కొన్ని బేసిక్స్ చర్చిద్దాం “తత్త్వ” పరంగా. “తత్త్వం” పదానికి అసలైన అర్థం Reality అని.

“చతుర్ముఖబ్రహ్మ” అంటే శివ, విష్ణు, శక్తి అనే మూడింటిచేత చైతన్యవంతంచేయబడిన, విశ్వ సృష్టికి కారణమైన creative power or power to do creation.

“శివుడు”=టైమ్= కాలస్వరూపుడు= మహాకాలుడు అని ఇంకో పేరు.

దీని అర్థం ఏంటంటే, సృష్టిలో అంతర్భాగమైన సమస్తం కాలానికి కట్టుబడి నడుస్తున్నప్పటికీ కాలం అనేది తాను మాత్రం ఇండిపెండెంట్ గా అతీతంగా ఉంటుంది. అందుకే ఆ చైతన్యాన్ని “స్వఛ్ఛం”, “శుభంకరం” అంటారు, ఎటువంటి మాలిన్యం అంటదు కాబట్టి అదే “శివం”.

“విష్ణు”=స్పేస్= “వేష్టి వ్యాప్నోతి ఇతి విష్ణుః” అని సంస్కృతంలో వ్యుత్పత్తి(వ్యుత్పత్తి అనగా ఒక పదం యొక్క మూల స్వరూపం). దీని అర్థం “అంతటా వ్యాపించి ఉన్నది” అని.

“శక్తి(అమ్మవారు, స్త్రీరూపం)” = పంచ భూతాలతో కూడిన ప్రకృతి జీవకోటిపై చూపిస్తున్న ప్రభావమే శక్తి అంటే.

టైమ్-స్పేస్-ఎనర్జీ లేకుండా సృష్టిని ఊహించుకోలేమని నాస్తికుడు కూడా ఒప్పుకుంటాడు.

హిందువుల దేవతలు అందరూ, పైన చెప్పిన శివ,శక్తి,విష్ణువుల యొక్క సమాహారాలు కానీ ప్రతి ఒక్క దేవత లో ఆ మూడింటి పాళ్ళు వివిధమైన మోతాదులతో, ప్రకారములతో(permutations & Combinations) ఉంటాయి. ఇప్పటి వరకు ఏ సైంటిస్టు ఒక అణువు గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు. ప్రతి అణువు ఒక విశ్వంతో సమానం. ప్రతి అణువులో ప్రోటాన్, న్యూట్రాన్, ఎలెక్ట్రాన్ల గమనానికి కారాణమేదైయుందో ఆ చైతన్యాన్ని హిందువు “పరమాత్మ” అని అంటాడు. అదే విధంగా, ఒక మనిషిని కూడా జీవింపజేస్తున్నది అదే చైతన్యం తప్ప ఇంకోటి కాదు. ఈ కారణంగానే వేదం దేవుడిని సర్వవ్యాపి అని కీర్తించింది.

ఉదాహరణకి, గణపతి లేదా వినాయకుడు.

గణపతి = గురుత్వాకర్షణశక్తి = ఆంగ్లంలో Gravitational force . వివరణ ఏమిటి అంటే, ఉదాహరణగా ఒక వస్తువు అస్తిత్వంలో ఉండాలంటే తనకంటే పెద్దగావున్నదానిమీద ఆధారపడి ఉంటుంది. మనిషితో పాటూ జీవులు అన్నీ భూమిని ఆధారం చేసుకుని ఉన్నయి. భూమి దేనిని ఆధారం చేసుకుని ఉంది? భూమికంటే పెద్ద గ్రహాలు, ఇతర నక్షత్రాలు, గ్యాలక్సీలు, సోలార్ సిస్టంస్ ఇవన్నీ దేనిని ఆధారం చేసుకుని స్పేస్ లో ఉండగలుగుతున్నాయి? “పట్టి నడిపించే చైతన్యం”. దాని పేరే, ఆ చైతన్యం పేరే గణపతి అంటే. అలాగే గ్రహ-నక్షత్రాదులు ఛినాభిన్నం కాకుండా స్పేస్ లో ఒక పద్ధతిగా ఉండగలుగుతున్నయి ఆంటే “గణపతి” కారణం. మనిషియొక్క మూలాధారం లో(వెన్నెముక కి బేస్ లో) కనపడని శక్తి ఉంటుంది. గణపతి యొక్క స్థానం అది. భూమిపై మనం ఏ ఇబ్బంది లేకుండ సంచరించగలుగుతున్నామంటే ఆ “పట్టు” మాత్రమే కారణం. మన సంస్కృతి లో “పంచభూతాల సాక్షిగా” అని ఒట్టు పెట్టడం కనిపిస్తుంది. ప్రకృతి లోని పంచభూతాలు జడ పదార్థాలు కావు, అత్యంత చైతన్యవంతమైనవి.

గణపతి ఊదాహరణగా ఏ హిందూ దేవతనైనా ఆరాధించడానికి మన సంస్కృతికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది, మంత్రం(సౌండ్ ఎనర్జీ) ద్వారా. ప్రకృతితో మన పంచభూతాత్మకమైన శరీరం యొక్క అనుసంధానం ఎలా సాధ్యం అంటే, సౌండ్(ధ్వని) ద్వారా సాధ్యం. మనిషి యొక్క వాక్కు ద్వారా పుట్టే ధ్వనిశక్తితరంగాలు వాతవరణంలో వ్యాపించి ప్రకృతితో communicate చేస్తాయి. ప్రతినిత్యం వేద పఠనం జరగాలి అనేది అందు కొరకే. ప్రకృతిని స్పందింపజేసే విధానం అంటే technique అన్న మాట, ప్రకృతి యొక్క భాష సంస్కృత భాష.

మానవశరీరంలో పంచభూతాల యొక్క స్థానములు ఈ విధంగా ఉంటాయి.

“భూతత్త్వం” వలన శరీరం పొందే చైతన్యం అధికంగా వెన్నెముక కి బేస్ లో, చర్మం, ఏముకలు ఇత్యాది ఘనపదార్థాలలో ఉంటుంది.

“వాయుతత్త్వం” వలన శరీరం పొందే చైతన్యం అధికంగా శ్వాస(ఊపిరి) లో , “దేవదత్త”, “ధనంజయ”ఇత్యాది సూక్ష్మవాయువులో ఉంటుంది

“అగ్నితత్త్వం” వలన శరీరం పొందే చైతన్యం అధికంగా జీర్ణకోశం , వాక్కులలో ఉంటుంది

“జలతత్త్వం” వలన శరీరం పొందే చైతన్యం రక్తం ఇత్యాది శరీరద్రవాలలో ఉంటుంది

“ఆకాశతత్త్వం” వలన శరీరం పొందే చైతన్యం నవరంధ్రాలలో ఉంటుంది

మనిషి యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే ప్రకృతి మధ్యలో బ్రతుకుతున్నందుకు గాను కృతజ్ఞతగా ప్రకృతి ప్రసాదించిన ఈ పంచభూతాలతో కూడిన ఈ శరీరాన్ని ప్రకృతిలోని పంచభూతాలతో అనుసంధానం చేసి Eco-Friendly గా సామరస్యమైన రీతిలో తాను ఉంటూ లోకక్షేమంపై కూడా బాధ్యత వహించడం, ప్రకృతి సుభిక్షంగా ఉండేలా బాధ్యత వహించడం. ప్రతి మనిషీ ఈ జీవన విధానాన్ని బ్రతుకుదెరువుగా ఎంచుకోవడం ప్రాక్టికల్ గా చూస్తే అసాధ్యం కాబట్టి, ప్రత్యేకంగా ఒక వర్గం వారు బాధ్యత వహించి పూర్తిగా తమ జీవితాలని అందుకుగాను అంకితం చెయ్యాలని వేదవాక్కు, అంటే పరమాత్మ యొక్క ఆదేశం. “వేదో నిత్యం అధీయతాం” అని జగద్గురువులైన ఆదిశంకరాచార్యులవారు అందుకు చెప్పారు. వర్ణవ్యవస్థ(కాస్ట్ సిస్టం) యొక్క అంతరార్థం తెలియడం ఇక్కడ మొదలు అవుతుంది.

https://www.hinduismtoday.com/modules/smartsection/item.php?itemid=1137

ప్రతి కులంవారూ ఈశ్వరస్వరూపులే మన హిందూ సంస్కృతి ప్రకారం. ఈ మాట మన గ్రంథాలలో అనేక చోట్ల చేప్పబడి ఉంది. ప్రతి వర్ణంవారూ ఒకరికి ఒకరు సహాయపడుతూ, తమదైన సంప్రదాయాన్ని, స్వధర్మాన్ని వదలకుండా తమ అస్తిత్వాన్నీ, ప్రకృతినీ కాపాడుకోవడం కాస్ట్ సిస్టమ్ యొక్క వాస్తవికమైన ధ్యేయం. పరాయిపాలనలో “విభజించు-పాలించు” అనే కుట్ర చేత ఈ వ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది. ప్రకృతి లో గాలి, నీరు కలుషితం అవటం ఎప్పుడైతే ప్రారంభించాయో అది ధర్మం క్షీణించింది అన్నదానికి తార్కాణం. ధర్మం క్షీణించటం అంటే ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తూ మనిషి తన స్వార్థానికి ప్రకృతిని వాడుకోవటం.

ఈ వ్యాసం ఇంకా సాగుతుంది..తరువాయి భాగంలో..