సంపత్ తలిశెట్టి

‘సంపత్ తలిశెట్టి’ అంటే ఏ స్వాతంత్య్ర సమరయోధుడో కాదు, చరిత్రలో పేరు మోసిన ప్రముఖ వ్యక్తి కూడా కాదు. అతను ఒక సాధారణ మధ్య తరగతి యువకుడు. ‘శివశక్తి’ పునాది రాళ్ళలో ఒకడు.

ఐతే ఏమిటి అతనిలో ప్రత్యేకత? స్వర్గస్తులైన వారి గురించి మంచిగా, గొప్పగా చెప్పుకోవడం లోకరీతి కనుక ఆ పంథాలోనే సంపత్ గురించి కూడా అతిశయంగా చెప్తున్నామా? లేక మనం స్మరించుకోదగిన లక్షణాలు అతనిలో ఏమైనా ఉన్నాయా? అంటే సంపత్ గురించి మాకు తెలిసిన రెండు విషయాలు చెప్తాము. శివశక్తి ని స్థాపించింది మొదలు సంపత్ తన కుటుంబ బాధ్యతలతో పాటు శివశక్తి భాద్యతలను కూడా అంతే శ్రద్దగా నిర్వహించేవాడు. జీవితంలో స్థిరపడిన వారికి కూడా క్షణం తీరిక లేని ఈ రోజుల్లో ఒక పక్క తన కుటుంబ భారాన్ని మోస్తూ మరోపక్క శివశక్తి అభ్యున్నతికి, తద్వారా హిందూధర్మ పునర్వైభవానికి శాయశక్తులా కృషి చేశాడు. ఇందుకోసం రోజులో కొంత సమయాన్ని, ఇరవై వేల రూపాయల తన జీతంలో కొంత భాగాన్ని హిందూధర్మం కోసం కేటాయించి తన వ్యక్తిగత ధర్మాన్ని మనసా వాచా కర్మణా ఆచరించి మాకు ఆదర్శవంతుడయ్యాడు.

హైద్రాబాద్ లో ఒకసారి శివశక్తి హిందూ సోదరులతో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. దానికి హాజరవ్వడానికి భాగ్యనగరంలోనే ఉన్న కొంతమందికి తీరుబాటు లేదు కానీ, సంపత్ ఒకటిన్నర రోజు ప్రయాణం చేసి గుజరాత్ నుంచి వచ్చాడు. తన ఆఫీస్ మేనేజర్ తో వాదించి మరీ నెలకి ఒక్కసారి ధర్మ ప్రచారం కోసం ఆంధ్రా వెళ్లి రావడానికి అనుమతి తీసుకున్నాడు. తన వ్యక్తిగత జీవితాన్ని కొంత వదులుకుని, సర్దుబాటు చేసుకుని సమాజ హితం కోసం తాపత్రయపడ్డ సంపత్ మాకు ఎప్పటికీ మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత.

ఆర్థిక ఇబ్బందులతో తనువు చాలించి మాకు భౌతికంగా దూరమయ్యాడు. మా బాధ్యతలు పంచుకున్న సంపత్ తన బాధలు మాత్రం మాతో పంచుకోలేదనే విషయం గుర్తు వచ్చినప్పుడల్లా మా హృదయాలు శోకసంద్రాలవుతాయి. తన గుర్తుగా హిందూధర్మం కోసం విశేష సేవ చేస్తున్న సామాన్యులలో ఒకరికి ప్రతియేటా శివశక్తి ఆవిర్భావ దినోత్సవం రోజున “సంపత్ తలిశెట్టి స్మారక పురస్కారం” తో సత్కరించాలని నిర్ణయించాం.

ఇది ఆ అమరజీవికి మేమందించే చిరు నివాళి.
– అశ్రునయనాలతో శివశక్తి సభ్యులు.